చిలకలూరిపేట సుబ్బయ్య తోటలో ఆకతాయిల బీభత్సం.. మాటువేసి పెట్రోల్ దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు
పల్నాడు జిల్లా, చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోట, గౌడ వీధిలో గత కొన్ని రోజులుగా అర్ధరాత్రి పూట కొందరు ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇళ్ల ముందు ఆపి ఉంచిన ద్విచక్ర వాహనాలు, సైకిళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా దాడులకు తెగబడుతోంది. బైకులను కింద పడేయడం, అద్దాలు పగలగొట్టడం, సెంట్రల్ స్టాండ్లు విరగ్గొట్టడం లాంటి విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఉదయం నిద్రలేచి చూసేసరికి తమ వాహనాలు డ్యామేజ్ కావడాన్ని గమనించిన బజారు వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
వరుసగా రెండు రోజుల పాటు ఇదే తంతు కొనసాగడంతో విసిగిపోయిన స్థానికులు, నిన్న రాత్రి ఆ వీధిలో పక్కాగా మాటు వేశారు. అదే సమయంలో సుజాత డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దేవరకొండ గోపాలకృష్ణకు చెందిన ద్విచక్ర వాహనంలోంచి పెట్రోల్ దొంగిలిస్తుండగా.. జల్లెడ గణేష్ అనే స్థానికుడు ఒక యువకుడిని గమనించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అతన్ని గట్టిగా నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో, స్థానికులంతా ఒక్కటయ్యారు. తమ వాహనాలకు నష్టం చేకూరుస్తున్న ఆకతాయికి బుద్ధి వచ్చేలా దేహశుద్ధి చేసి, నేరుగా తీసుకెళ్లి చిలకలూరిపేట టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.
స్థానికుల కలవరం - హెచ్చరిక:
చిలకలూరిపేట నడిబొడ్డున ఉండే సుబ్బయ్య తోట ప్రాంతం హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది. తెల్లవారుజామున ఒంటిగంట నుంచే మార్కెట్ హడావిడి మొదలవుతుంది కాబట్టి, పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇక్కడ ఎప్పుడూ జన సంచారం ఉంటుంది. జనావాసం ఎక్కువగా ఉండే ఇలాంటి రద్దీ ప్రాంతంలో దొంగతనాలు జరగడం చాలా అరుదు. కానీ, గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ పరిణామాలతో బజారు వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
దీనిపై పోలీసులు వెంటనే స్పందించి రాత్రి పూట పెట్రోలింగ్ పెంచాలని, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మళ్లీ ఎవరైనా ఇలాంటి దొంగతనాలకు, వాహనాల ధ్వంసానికి పాల్పడుతూ దొరికితే.. తీవ్రమైన దేహశుద్ధి తప్పదని, అలాగే పోలీసు కేసులు పెట్టి కఠినంగా శిక్షింపజేస్తామని స్థానికులు గట్టిగా హెచ్చరించారు.
ఇకపై కరెంట్ బిల్లు కట్టే అవసరం లేదు - పూర్తి వివరాల కోసం ఇప్పుడే కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్ - సోలార్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆ తర్వాతే బిగించుకోండి.
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి.





No comments:
Post a Comment