చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్:
కూటమి పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీకి దక్కిన చిలకలూరిపేట మున్సిపల్ చైర్పర్సన్ స్థానం చుట్టూ గత కొద్ది రోజులుగా నడిచిన హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది. టికెట్ కోసం ముగ్గురు బలమైన నేతల మధ్య జరిగిన హోరాహోరీ పోరులో.. అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన ఒకరిని అదృష్టం వరించింది. పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న పాత నాయకులను కాదని, అధిష్టానం తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఇప్పుడు చిలకలూరిపేట రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది!
♟️ రాజకీయ చదరంగంలో 'బైరా' మాస్టర్ స్ట్రోక్!
అసలు నిన్న మొన్నటి వరకు తెరపైనే లేని పేరు ఇది! 2009లో ప్రజారాజ్యం పార్టీ (PRP) తరఫున చిలకలూరిపేటలో పోటీ చేయాలనుకుని, సామాజిక సమీకరణాల దెబ్బతో సత్తెనపల్లికి మారి అక్కడ ఓటమి పాలైన బైరా దిలీప్ చక్రవర్తి.. ఆ తర్వాత రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. కానీ, సరిగ్గా మున్సిపల్ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో తనకున్న బలమైన రాజకీయ నెట్వర్క్, మెగాస్టార్ చిరంజీవితో ఉన్న సాన్నిహిత్యం, తన అన్నయ్యకున్న పలుకుబడిని ఉపయోగించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. తన సతీమణి డాక్టర్ పావని కోసం చైర్పర్సన్ టికెట్‌ను ఖరారు చేయించుకుని తన పొలిటికల్ పవర్‌ను నిరూపించుకున్నారు.
💔 పార్టీని నమ్ముకున్న పాత నాయకులకు నిరాశేనా?
ఈ నిర్ణయం జనసేన లోకల్ క్యాడర్లో పెద్ద బాంబే పేల్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో అవమానాలు భరిస్తూ, చిలకలూరిపేటలో జనసేన జెండాను భుజాన మోసిన తోట రాజా రమేష్ వర్గీయులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. కూటమి అధికారంలోకి రాగానే తన సతీమణికి మున్సిపల్ పీఠం దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి ఈ నిర్ణయం మింగుడు పడటం లేదు.
మరోవైపు.. పట్టణంలో జనసేన జోష్‌ను అమాంతం పెంచిన యువ కెరటం, స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా 'ప్రదాత' అనే బిరుదు పొందిన మండలనేని చరణ్ తేజ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. చరణ్ తేజ్ కుటుంబ సభ్యురాలైన పద్మావతికి టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయిపోయిందని అంతా సంబరాలు చేసుకుంటున్న తరుణంలో.. లాస్ట్ మినిట్‌లో సీన్ రివర్స్ అవ్వడంతో ఆ వర్గం సైతం డైలమాలో పడిపోయింది.
🩺 చైర్పర్సన్ రేసులో విద్యావంతురాలు.. తెరపైకి డాక్టర్ పావని! 🌟
అధిష్టానం మాత్రం బైరా దిలీప్ చక్రవర్తి సతీమణి డాక్టర్ పావని వైపే మొగ్గు చూపడానికి బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఉన్నత విద్యావంతురాలు, వృత్తిరీత్యా వైద్యురాలు కావడం.. చిలకలూరిపేట పట్టణాభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి ఒక చదువుకున్న మహిళ అయితేనే కరెక్ట్ అని పార్టీ పెద్దలు భావించినట్లు సమాచారం.
🌪️ సైలెంట్ అవుతారా? సై అంటారా? (ముందున్న సవాల్..)
టికెట్ అయితే ఖరారైంది కానీ, అసలు రాజకీయం ఇప్పుడే మొదలు కానుంది. ఎప్పటినుంచో పార్టీని నమ్ముకున్న మండలనేని, తోట వర్గాలు ఈ నిర్ణయాన్ని ఎంతవరకు స్వాగతిస్తాయి? 'బైరా' కుటుంబానికి వారు ఎన్నికల్లో పూర్తి మద్దతు ఇస్తారా? లేక లోపాయికారీ రాజకీయాలకు తెరలేపుతారా? అన్నది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్. అసమ్మతి సెగలను చల్లార్చి, అందరినీ కలుపుకుని పోవడంలో బైరా దిలీప్ చక్రవర్తి తన వ్యూహాలను ఎలా అమలు చేస్తారో వేచి చూడాల్సిందే!





No comments:
Post a Comment