చిలకలూరిపేట - ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో చిలకలూరిపేట వ్యక్తులకు పెద్దపీట..ముగ్గురికి డైరెక్టర్ల పదవులు! వారు ఎవరంటే....?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ, టెలివిజన్, రంగస్థల కళల అభివృద్ధికి కీలకమైన 'ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' (ఏపీఎస్ఎఫ్‌టీవీటీడీసీ) నూతన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది. ఈ నూతన బోర్డులో పల్నాడు జిల్లా, చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన ముగ్గురు విశిష్ట వ్యక్తులకు 'డైరెక్టర్లు'గా అరుదైన అవకాశం దక్కడం స్థానికంగా సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
కమిటీలో మన ప్రాంత ఆణిముత్యాలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రకటించిన 14 మంది డైరెక్టర్ల జాబితాలో మన ప్రాంతానికి చెందిన ముగ్గురు ప్రముఖులు చోటు దక్కించుకున్నారు.
- చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన విశేష వ్యక్తులు డాక్టర్ కందిమళ్ళ సాయిశివరావు
- నాదెండ్ల గ్రామానికి చెందిన ప్రముఖ సినీ నటుడు శివాజీ శొంఠినేని
- యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు వి. సముద్ర వీరు ముగ్గురూ ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ విధానపరమైన నిర్ణయాలలో, కళారంగాల అభివృద్ధిలో తమ వంతు కీలక పాత్ర పోషించనున్నారు.
చైర్మన్‌గా భరత్ భూషణ్, వైస్ చైర్మన్‌గా మెహర్ రమేష్
ఈ నూతన కమిటీకి చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పి. భరత్ భూషణ్‌ను ప్రభుత్వం నియమించగా, వైస్ చైర్మన్ బాధ్యతలను ప్రముఖ సినీ దర్శకుడు చిక్కాల మెహర్ రమేష్‌కు అప్పగించింది. మన చిలకలూరిపేట వాసులతో పాటు... ప్రముఖ సీనియర్ నటుడు సుమన్ తల్వార్, నటి ఝాన్సీ, సీనియర్ దర్శకులు ఎస్.వి. కృష్ణారెడ్డి, ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, వివేక్ కూచిభొట్ల తదితరులు డైరెక్టర్లుగా (సభ్యులుగా) ఎంపికైన వారిలో ఉన్నారు.
నంది అవార్డులు, కళారంగాల అభివృద్ధిపై ప్రధాన దృష్టి
రాష్ట్రంలో నిర్వీర్యమవుతున్న నాటకరంగానికి (థియేటర్) పూర్వ వైభవం తీసుకురావడం, టెలివిజన్ రంగాన్ని మరింత ప్రోత్సహించడం, ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని సినిమా మరియు టీవీ షూటింగ్‌లు జరిగేలా అనుకూల వాతావరణం కల్పించడం ఈ కొత్త కమిటీ ముందున్న ప్రధాన లక్ష్యాలు. ముఖ్యంగా కళాకారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 'నంది అవార్డులు', 'నంది నాటకోత్సవాలు' పునఃప్రారంభించే దిశగా ఈ కమిటీ ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
గ్రామాల్లో వెల్లువెత్తుతున్న ఆనందం
సినిమా, నాటక రంగాలకు సంబంధించి రాష్ట్ర స్థాయి అత్యున్నత కమిటీలో ఒకేసారి మన చిలకలూరిపేట ప్రాంత పరిసరాలకు చెందిన ముగ్గురికి చోటు దక్కడం పట్ల స్థానిక ప్రజలు, కళాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాదెండ్ల, బోయపాలెం గ్రామస్తులతో పాటు చిలకలూరిపేట పట్టణవాసులు ఈ వార్తను ఒకరికొకరు సంతోషంగా పంచుకుంటున్నారు. వీరు తమ అనుభవంతో రాష్ట్ర కళారంగానికి సేవ చేయడమే కాకుండా, మన ప్రాంత గుర్తింపునకు మరింత వన్నె తెస్తారని స్థానికులు ఆకాంక్షిస్తున్నారు.
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.





No comments:
Post a Comment