చిలకలూరిపేట - బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆధార్ అప్‌డేట్‌ల పేరిట పగటి దోపిడీ!
అధికంగా డబ్బులు గుంజుతున్నారని పట్టణవాసి నాయుడు శివ ఆరోపణ.. అధికారులకు వినతిపత్రం అందజేత.
చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్): కేంద్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాలు కొందరు సిబ్బంది కాసుల కక్కుర్తికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. సామాన్యుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని నిలువుదోపిడీకి పాల్పడుతున్నారు. తాజాగా చిలకలూరిపేట పట్టణంలోని గాంధీపేటలో ఉన్న బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలోని ఆధార్ కేంద్రంలో అప్‌డేట్‌ల పేరుతో ప్రజల నుంచి ఇష్టానుసారంగా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త నాయుడు శివ తీవ్రంగా ఆరోపించారు.
అసలేం జరిగిందంటే..
పట్టణంలోని సుబ్బయ్య తోట ప్రాంతంలో నివసించే నాయుడు శివ కుటుంబ సభ్యులు తమ ఆధార్ కార్డులో పేరు మార్పు, ఇతర అప్‌డేట్‌ల నిమిత్తం బుధవారం గాంధీపేట బీఎస్ఎన్ఎల్ ఆఫీస్‌లోని ఆధార్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ పని పూర్తయిన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన నిర్దేశిత రుసుము కాకుండా, సదరు కంప్యూటర్ ఆపరేటర్ దౌర్జన్యంగా అదనపు డబ్బులు డిమాండ్ చేసినట్లు శివ ఆరోపించారు. ఎందుకు ఎక్కువ అడుగుతున్నారని ప్రశ్నించిన వారిపై నిర్లక్ష్యంగా, దురుసుగా సమాధానం ఇచ్చారని మండిపడ్డారు.
నిత్యం ఎంతో మంది సామాన్యులు, వృద్ధులు, విద్యార్థులు తమ ఆధార్ పనుల కోసం ఉదయం నుంచే క్యూ లైన్లలో నిలబడితే.. ఇలాంటి ఆపరేటర్లు మాత్రం వారి అవసరాన్ని బట్టి జేబులు గుల్ల చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులకు ఫిర్యాదు.. చర్యలకు డిమాండ్
ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నాయుడు శివ.. వెంటనే స్పందించి స్థానిక బీఎస్ఎన్ఎల్ ఉన్నతాధికారిని స్వయంగా కలిసి లిఖితపూర్వకంగా వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అదనపు వసూళ్లకు పాల్పడుతున్న సదరు కంప్యూటర్ ఆపరేటర్ పై, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆ వినతిపత్రంలో డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ఆధార్ కేంద్రం వద్ద ప్రజలకు స్పష్టంగా కనిపించేలా 'ప్రభుత్వ నిర్దేశిత రుసుములతో కూడిన బోర్డు'ను ఏర్పాటు చేయాలని కోరారు. అమాయక ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, ఈ దందాను అరికట్టకపోతే ప్రజల పక్షాన నిలబడి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని ఆయన అధికారులకు విన్నవించారు.
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.





No comments:
Post a Comment