చిలకలూరిపేటలో తీవ్ర విషాదం: అప్పుల ఊబిలో యువకుడి ఆత్మహత్య 💔
చిలకలూరిపేట టౌన్: పట్టణంలోని ఎన్వీ నారాయణరెడ్డి కాలనీలో అప్పుల బాధలు తాళలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కళ్లెదుటే భర్త విగతజీవిగా వేలాడుతుండటం చూసి ఆ భార్య పడుతున్న రోదనలు, నాన్నకు ఏమైందో తెలియని ఆ చిన్నారుల అమాయకత్వం అక్కడి వారిని కంటతడి పెట్టిస్తోంది.
📌 బతుకుదెరువు కోసం వచ్చి.. అప్పుల పాలై.. 😔
సంతమాగులూరు మండలం గురిగేపల్లికి చెందిన నేరెళ్ల ఏడుకొండలు (32) మార్బుల్స్ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. మెరుగైన జీవనం కోసం ఐదేళ్ల క్రితం భార్యాపిల్లలతో కలిసి చిలకలూరిపేట వలస వచ్చాడు. భార్య స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, వీరికి ఇద్దరు కుమారులు. తల్లి పనిచేస్తున్న స్కూల్లోనే ఆ పిల్లలు చదువుకుంటున్నారు. ఒకప్పుడు ఏడుకొండలుకు బెట్టింగ్ ఆడే అలవాటు ఉండేది. అయితే కొంతకాలంగా దానికి దూరంగా ఉంటున్నప్పటికీ.. పాత అప్పుల భారం అతన్ని మానసికంగా కుంగదీసింది.
💰 తాకట్టు పెట్టిన బంగారం.. చివరి చూపు.. 🏦
అప్పుల వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఏడుకొండలు రెండు రోజుల క్రితమే ఇంట్లో ఉన్న బంగారం అంతా బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.2 లక్షలు తెచ్చాడు. ఆ తర్వాత ఉదయం 10 గంటల సమయంలో భార్య పనిచేస్తున్న స్కూల్ వద్దకు వెళ్లి.. ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టి 'జాగ్రత్తగా ఉండు' అని చెప్పి ఇంటికి చేరుకున్నాడు. అవే తన భర్త చివరి మాటలు అవుతాయని ఆ ఇల్లాలు ఊహించలేకపోయింది.
😭 కంటతడి పెట్టిస్తున్న పిల్లల మాటలు.. 💔
ఈ ఘటనలో అందరినీ కలచివేస్తున్న అత్యంత విషాదకరమైన విషయం పిల్లల అమాయకత్వం. సాయంత్రం 6 గంటలకు భార్య స్కూల్ నుంచి ఇంటికి వచ్చి కింద తెలిసిన వారితో మాట్లాడుతుండగా, పిల్లలు ఆడుకుంటూ పైకి వెళ్లారు. తండ్రి ఉరివేసుకుని గాలిలో వేలాడుతుండటం చూసి, "అమ్మా.. నాన్న పైన యోగా చేస్తున్నాడు.. కానీ ఎంత పిలిచినా పలకడం లేదు, కదలడం లేదు" అని అమాయకంగా తల్లికి చెప్పారు.
🚓 కుప్పకూలిన భార్య - రంగంలోకి పోలీసులు 🚨
పిల్లల మాటలతో అనుమానం వచ్చి పరుగుపరుగున పైకి వెళ్లిన భార్య.. ప్రాణాల్లేకుండా వేలాడుతున్న భర్తను చూసి గుండెలు బాదుకుంటూ కుప్పకూలిపోయింది. ఆమె ఆర్తనాదాలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని ఏడుకొండలును కిందకు దించారు. అప్పటికే అతడు మృతి చెందడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
🗣️ స్పీడ్ న్యూస్ విజ్ఞప్తి: క్షణికావేశంలో తీసుకునే ఇలాంటి నిర్ణయాల వల్ల పసిపిల్లలు, అండగా నిలవాల్సిన భార్య అనాథలవుతున్నారు. అప్పుల భారం ఎంతున్నా ప్రాణాలు తీసుకోవడం దేనికీ పరిష్కారం కాదు. ధైర్యంగా పోరాడి గెలవాలి కానీ, ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తుందని గుర్తుంచుకోండి.




