చిలకలూరిపేట - ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..ప్రాణం తీసిన 'ఫెయిల్' భయం
విద్యార్థుల పాలిట పరీక్షల భయం ప్రాణసంకటంగా మారుతోంది. ఫలితాలు ఎలా వస్తాయో అన్న ఆందోళన, తక్కువ మార్కులు వస్తే తల్లిదండ్రులు, సమాజం ఏమనుకుంటుందో అన్న ఒత్తిడి తట్టుకోలేక ఎందరో విద్యార్థులు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్న ఘటనలు కలచివేస్తున్నాయి. తాజాగా చిలకలూరిపేట పట్టణంలో చోటుచేసుకున్న ఇలాంటి ఘటనే స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలానికి చెందిన సదరు విద్యార్థిని, చిలకలూరిపేట పట్టణంలోని ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గత ఏడాది జరిగిన ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో ఆమెకు నాలుగు సబ్జెక్టులు మిగిలిపోయాయి. తాజాగా ఇప్పుడు రాసిన సెకండియర్ ఫలితాలు కూడా అనుకూలంగా రావేమోనన్న తీవ్ర మానసిక ఒత్తిడికి ఆమె లోనైంది. ఈ మనస్తాపంతో రెండు రోజుల క్రితం తీవ్ర నిర్ణయం తీసుకుని, ఎలుకల మందు సేవించింది.
గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (GGH) కి తీసుకువెళ్లారు. అక్కడ ప్రాణాలతో పోరాడుతూ మంగళవారం రాత్రి పరిస్థితి మరింత విషమించడంతో విద్యార్థిని కన్నుమూసింది. కళ్లెదుటే పెరిగి పెద్దయిన బిడ్డ విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పెదనందిపాడు ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
స్పీడ్ న్యూస్ విజ్ఞప్తి:
విద్యార్థులకు, తల్లిదండ్రులకు మాదొక చిన్న విజ్ఞప్తి. పరీక్షలు, అందులో వచ్చే మార్కులు మాత్రమే జీవితాన్ని నిర్ణయించలేవు. ఫెయిల్ అవ్వడం అనేది జీవితానికి ముగింపు కాదు, అది మరో ప్రయత్నానికి నాంది మాత్రమే. పిల్లలు ఒత్తిడిలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా వారికి అండగా నిలవాలి, ధైర్యం చెప్పాలి. క్షణికావేశంలో ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుని కన్నవారికి కడుపుకోత మిగల్చకండి.
- ఎప్పటికప్పుడు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి.. మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్.
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.




