🚨 చిలకలూరిపేట స్పీడ్ న్యూస్ ఎక్స్క్లూజివ్: తూబాడులో పోలీసుల మెరుపు దాడులు.. వణికిపోయిన గంజాయి బ్యాచ్, ఫ్యాక్షనిస్టులు!
నాదెండ్ల మండల పరిధిలోని తూబాడు గ్రామంలో ఉదయాన్నే పోలీసుల సైరన్లతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పల్నాడు జిల్లా ఎస్పీ కఠిన ఆదేశాల మేరకు, నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు నేతృత్వంలో సుమారు 80 మందికి పైగా పోలీసు సిబ్బంది గ్రామాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. అణువణువూ జల్లెడ పడుతూ భారీ 'కార్డన్ అండ్ సెర్చ్' ఆపరేషన్ చేపట్టారు. నేరాల నియంత్రణే ధ్యేయంగా పోలీసులు ఈ తనిఖీలను అత్యంత పకడ్బందీగా నిర్వహించారు.🏍️ పత్రాల్లేవా.. అయితే బండి లోపలకే!
గ్రామంలోని ప్రతి ఇల్లు, ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న 28 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను అదుపులోకి తీసుకున్నారు. "ఈరోజు రాత్రి 8 గంటలలోపు పోలీస్ స్టేషన్లో సరైన డాక్యుమెంట్లు చూపించి బండ్లు తీసుకెళ్లండి.. లేదంటే శాశ్వతంగా సీజ్ చేస్తాం" అని అధికారులు వాహనదారులకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు.
⚔️ ఎన్నికల వేళ గొడవలు చేస్తే జైలుకే!
తూబాడు ప్రాంతానికి ఉన్న గత ఫ్యాక్షన్ చరిత్రను దృష్టిలో ఉంచుకుని, రాబోయే నరసరావుపేట మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందుస్తుగా ఈ భారీ ఆపరేషన్ నిర్వహించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఎన్నికల సమయంలో చిన్నపాటి గొడవలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఏమాత్రం ఉపేక్షించేది లేదని, కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి లోపల వేస్తామని రౌడీషీటర్లకు, అల్లరి మూకలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
🌿 గంజాయి మహమ్మారిపై ఉక్కుపాదం!
ఒడిశా తదితర ప్రాంతాల నుంచి గంజాయిని అక్రమంగా తీసుకువచ్చి విక్రయిస్తూ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ముఠాలపై పోలీసులు సీరియస్ అయ్యారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై, వారి స్నేహితులపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ఇప్పటికే మన చిలకలూరిపేట నియోజకవర్గంలో గంజాయి మత్తుకు బానిసైన 25 మంది యువకులను గుర్తించి వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చిన విషయాన్ని అధికారులు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
📞 చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు.. వెంటనే '112' కి కాల్ చేయండి!
గ్రామంలో కొత్త వ్యక్తులు సంచరించినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా వెంటనే '112' టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. ద్విచక్ర వాహనదారులు తమ ప్రాణరక్షణ కోసం విధిగా హెల్మెట్ ధరించాలని కోరారు. ఎలాంటి సమస్యనైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పెద్దలు చేయకుండా.. స్థానిక సీఐ, ఎస్సైల దృష్టికి తెచ్చి సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు హితవు పలికారు.
మరిన్ని వేగవంతమైన స్థానిక వార్తల కోసం చూస్తూనే ఉండండి.. మీ చిలకలూరిపేట స్పీడ్ న్యూస్! ⚡📱





No comments:
Post a Comment