చిలకలూరిపేటలో విషాదం: రోడ్డు ప్రమాదంలో కృతి ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ బ్రెయిన్ డెడ్.. అవయవ దానం చేసి ముగ్గురికి పునర్జన్మ. పూర్తి వివరాలు కోసం....
రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ పాఠశాల డైరెక్టర్ బ్రెయిన్ డెడ్
అవయవ దానంతో ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపిన పెడవల్లి నాగేశ్వరరావు
చిలకలూరిపేట (స్పీడ్ న్యూస్):
భౌతికంగా ఈ లోకాన్ని వీడినా.. తన అవయవ దానంతో మరో ముగ్గురికి ప్రాణదానం చేసి సజీవంగా నిలిచారు ఓ విద్యావేత్త. కావూరు - లింగంగుంట్ల పరిధిలోని 'కృతి ఇంటర్నేషనల్ పాఠశాల' డైరెక్టర్ పెడవల్లి నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ కాగా, పుట్టెడు దుఃఖంలోనూ ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న గొప్ప నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
కలచివేసిన రోడ్డు ప్రమాదం..
వివరాల్లోకి వెళితే.. పెడవల్లి నాగేశ్వరరావు శనివారం నాడు తన కుమార్తె ఉజ్వల భవిష్యత్తు కోసం, ఎంసెట్ కోచింగ్ నిమిత్తం చిలకలూరిపేటలోని ఓ కళాశాలలో ఆమెను దిగబెట్టి ద్విచక్రవాహనంపై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. నరసరావుపేట - కావూరు మార్గమధ్యలో ఆయన ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి స్కిడ్ కావడంతో ఆయన కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తల నేలకి బలంగా తాకడంతో అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ ద్వారా చిలకలూరిపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రాణాలు నిలపాలని ఆసుపత్రుల చుట్టూ పరుగులు..
పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ట్రామా కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి పురోగతి లేకపోవడం, సరైన వైద్యం అందడంలేదని భావించిన కుటుంబ సభ్యులు.. మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన మంగళగిరిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. తలకు బలమైన గాయం కావడంతో పాటు మెదడులో రక్తం గడ్డకట్టడంతో నాగేశ్వరరావు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆదివారం నాడు ఆయన తుదిశ్వాస విడిచారు.
మరణంలోనూ వీడని మానవత్వం..
విధి ఆడిన నాటకంలో తమ ఇంటి పెద్దను కోల్పోయి ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నప్పటికీ, నాగేశ్వరరావు సతీమణి మరియు కుటుంబ సభ్యులు గొప్ప మనసు చాటుకున్నారు. ఏపీ జీవన్‌ధాన్ ఛైర్మన్ డాక్టర్ రాంబాబు, మణిపాల్ ఆసుపత్రి డైరెక్టర్ రామాంజనేయ రెడ్డిల పర్యవేక్షణలో నాగేశ్వరరావు శరీరంలోని కళ్లు, లివర్, కిడ్నీలను దానం చేశారు. సేకరించిన కళ్లను వెంటనే హైదరాబాద్‌లోని ఎల్.వి.ఆర్ ఆసుపత్రికి తరలించారు.
ఒక పక్క కుమార్తె భవిష్యత్తు కోసం ఆమెను కళాశాలలో దిగబెట్టి వస్తూ ఇలా ప్రమాదానికి గురికావడం ఆ కుటుంబాన్ని, స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది. ప్రాణాలు కోల్పోయినా.. మరో ముగ్గురికి అవయవ దానం చేసి, వారి జీవితాల్లో వెలుగులు నింపిన పెడవల్లి నాగేశ్వరరావు గొప్పతనాన్ని స్థానికులు, తోటి విద్యావేత్తలు కన్నీటి పర్యంతమవుతూ కొనియాడుతున్నారు. ఆయన భౌతికంగా లేకపోయినా దానం చేసిన అవయవాల రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారని నివాళులు అర్పిస్తున్నారు.
చిలకలూరిపేట కరెంటు వినియోగదారులుకు సోలార్ బిగించుకోవడం వల్ల మీ కరెంటు బిల్లు " 0 "చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కోసం కింది నెంబర్ కి కాల్ చేయండి - +91 70135 89826 - ఆదిత్య సోలార్
మరిన్ని చిలకలూరిపేట వార్తల కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.





No comments:
Post a Comment